ఇక నుంచి రాయలసీమ రక్షణ సీమ
అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్రవారం రాయలసీమలో పర్యటించనున్నారు.
ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:15 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ వెనుక ఏర్పాటు చేసిన ఉన్న శంకుస్థాపన కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ అథారిటీ (ADA) ఆధ్వర్యంలోని ఎయిర్‌క్రాఫ్ట్ ఇంటిగ్రేషన్ – ఫ్లైట్ టెస్ట్ సెంటర్ శంకుస్థాపనతో పాటు, ఇతర రక్షణ, డ్రోన్ రంగ పరిశ్రమల భూమి పూజ కార్యక్రమాల్లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 02:20 గంటలకు తిరిగి అమరావతిలోని తన నివాసానికి చేరుకుంటారు.
ఇదిలా ఉండగా మొత్తం 12 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ రూ. 1430 కోట్ల పెట్టుబడి పెట్టనుంది 565 మందికి ఉపాధి కల్పించనుంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కంపెనీ రూ. 489 కోట్ల పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా 500 మందికి ఉపాధి లభించనుంది. HFCL కంపెనీ రూ. 1040 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీలో 870 మందికి ఉపాధి రానుంది. ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ సంస్థ రూ. 500 కోట్ల పెట్టుబడి తో 2050 మందికి ఉపాధి ఇవ్వనుంది. అల్గోబాటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 34 కోట్ల పెట్టుబడి పెట్టి 52 మందికి ఉపాధి కల్పించనుంది. డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ. 255 కోట్ల పెట్టుబడి చేయనుంది. దీని ద్వారా 850 మందికి ఉపాధి కలగనుంది. డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్ కంపెనీ రూ. 5 కోట్ల పెట్టుబడితో 14 మందికి ఉపాధి ఇవ్వనుంది.





