
తెలంగాణ సర్కార్ పై మండిపడ్డ మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : రైతులను కొట్టడమేనా రాహుల్ గాంధీ చెప్పిన ‘మొహబ్బత్ కీ దుకాణ్ అని నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. పాత రోజులు తెస్తానన్న రేవంత్ రెడ్డి అన్నంత పని చేసి, రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తున్నాడని మండిపడ్డారు. ఈ దుస్థితి తెలంగాణకు ఎందుకు వచ్చిందో ప్రజలు ఆలోచించాలి అని అన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హామీలివ్వడం, వాటిని గాలికొదలడం తప్ప చేసిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. జీఎస్టీలోని అడ్డగోలు స్లాబులతో 8 ఏళ్లలో రూ. 15 లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు బీహార్ ఎన్నికల కోసం స్లాబులు తగ్గించి, ప్రజలను పండుగ చేసుకోమనడం మోసం కాదా? దోచుకున్న ఆ డబ్బంతా తిరిగి ప్రజలకు చెల్లించాలని డిమాండ్ చేశారు.
నల్లధనం తెచ్చి రూ.15 లక్షలు ఇస్తానన్న హామీ ఏమైందని అన్నారు కేటీఆర్. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు, పేదలందరికీ ఇళ్లు, బుల్లెట్ రైళ్లు వంటి హామీలను నిలబెట్టు కోలేకపోయారని పేర్కొన్నారు. కానీ, దేవుడి పేరు చెప్పి ఎన్నికల్లో గెలుస్తున్నారని ఎద్దేవా చేశారు. రూ.350 ఉన్న సిలిండర్‌ను రూ.1200, రూ.65 ఉన్న పెట్రోల్‌ను రూ.100 దాటించారని ఆరోపించారు. వీటి ధరలు తగ్గిస్తే ప్రజలు పండుగ చేసుకుంటారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అని కేటీఆర్ విమర్శించారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వం అన్నారు. శ్రీరాముడు కూడా బీజేపీ మోసాన్ని గ్రహించి అయోధ్యలో ఆ పార్టీని ఓడించారని అన్నారు.