
సూపర్ 4లో భాగంగా కీలక మ్యాచ్
దుబాయ్ : ఆసియా కప్ 2025 ఆఖరి అంకానికి చేరుకుంది. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్నాయి ఎవరు విజేతనో తేలేందుకు. భారత్ చేతిలో రెండుసార్లు చావు దెబ్బ తిన్న పాకిస్తాన్ మరోసారి ముచ్చటగా మూడోసారి తలపడేందుకు సిద్దమైంది. నిన్న దుబాయ్ వేదికగా జరిగిన కీలక పోరులో బంగ్లాదేశ్ జట్టు చివరి వరకు పోరాడింది.కానీ 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. టోర్నీ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 136 రన్స్ చేసింది. అనంతరం బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 రన్స్ చేసింది. షహీన్ అఫ్రిదీ , రౌఫ్ లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇద్దరు బౌలర్లు చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో పాకిస్తాన్ నేరుగా ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి భారత జట్టుతో పాకిస్తాన్ ఢీకొననుంది .
ఇక సూపర్ ఫోర్ లో భాగంగా ఇప్పటికే ఆసియా కప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది శ్రీలంక జట్టు. శుక్రవారం ఇదే వేదికగా సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ కీలకం కాక పోయినప్పటికీ భారత్ మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కీలక మార్పులు చేసే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ మేరకు ఇప్పటి వరకు టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్ లలో పాలు పంచుకున్న ఆటగాళ్లను కాదని ఆడని ప్లేయర్లను ఆడించనున్నారు. టోర్నీలో ఇప్పటి వరకు జైత్రయాత్ర కొనసాగిస్తూ వస్తున్న ఇండియాను ఓడిస్తుందా లేదా అన్నది శ్రీలంపై అంచనాలు నెలకొన్నాయి.