
శాసన మండలిలో నిప్పులు చెరిగిన మంత్రి
అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. శుక్రవారం జరిగిన శాసన మండలిలో గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏపీని అన్ని రంగాలలో సర్వ నాశనం చేశారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుందన్నారు. అందుకే తనను, తన పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని అయినా బుద్ది రావడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి విలువైన సూచనలు ఇవ్వాల్సింది పోయి అడ్డదిడ్డమైన ఆరోపణలు చేయడం, నిరాధార విమర్శలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. విచిత్రం ఏమిటంటే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, తనను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు అచ్చెన్నాయుడు. ప్రతిపక్ష హోదా అనేది ప్రభుత్వం ఇవ్వదని, అది ప్రజలు ఇస్తే వస్తుందని అన్నారు. ఆ విషయం కూడా తెలియక పోవడం విడ్డూరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు.
జగన్ చేసిన ప్రతి పని ప్రజలకు వ్యతిరేకంగా చేసిందే తప్పా ఏ ఒక్కటి ఏపీకి మేలు చేసిన పాపాన పోలేదన్నారు. వైసీపీ కార్యకర్తలకే వాలంటీర్ల ఉద్యోగాలు ఇచ్చారని, అధికారంలో ఉన్నప్పుడే వాటిని రెన్యూవల్ చేయలేక చేతులెత్తేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో స్థానిక ఎన్నికలలో నామినేషన్లు వేసే అవకాశం లేదన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజాస్వామ్య బద్ధంగా అన్ని పార్టీలు నామినేషన్లు వేశారని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏ విధంగా నెరవేరుస్తామని కొంత ఆందోళన చెందామన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, కేంద్రంలో మోడీ నాయకత్వం వలనే హమీలు విజయవంతంగా అమలు చేశామన్నారు మంత్రి.