
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు వార్నింగ్
అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించారు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఎప్పటికప్పుడు సమాచారం అందజేయనిపేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాలు, కర్నూలు, నంద్యాలలో “మోస్తరు నుండి భారీ వర్షం” కురుస్తుందని, తీరప్రాంతంలో గంటకు 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని అంచనా వేసింది విపత్తుల నిర్వహణ సంస్థ.
సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. ప్రజలు పొంగి పొర్లుతున్న కాలువలను దాటవద్దని లేదా చెట్ల కింద, అసురక్షిత నిర్మాణాల కింద ఆశ్రయం పొందవద్దని సూచించింది. భారత వాతావరణ శాఖ అక్టోబర్ 2 వరకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో “భారీ వర్షాలు , ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. 26న ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ,యానాంలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మోస్తరు వర్షాలు వస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలలో కూడా 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
27న ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాయలసీమలో 30-40 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని 29వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపింది. తీరప్రాంత జిల్లాలతో పాటు రాయలసీమలో బలమైన గాలులు కొనసాగుతాయని అంచనా వేసింది.