మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ల మాటేంటి
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల అక్రమాస్తులు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వాళ్లు, బాధ్యతాయుతమైన పదవులలో ఉన్న వారు రెడ్ హ్యాండెడ్ గా పట్టు పడుతుండడం విస్తు పోయేలా చేస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి. ఒక సాధారణ ఇంజనీర్ దగ్గరే రూ. 100 కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉంటే, ఇక ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ మరియు ఐపీఎస్ అధికారుల వద్ద ఎంత సంపద ఉంటుందో? ఊహించుకుంటేనే వళ్లు జలదరించక తప్పదు.
మోహన్ నాయక్ సంచలనంగా మారాడు రాష్ట్ర వ్యాప్తంగా. నోట్ల కట్టలు, కళ్లు చెదిరే బంగారం, ఆస్తుల పత్రాలు లెక్కకు మించి దొరికాయి ఏసీబీ దాడులలో. తెలంగాణ రోడ్లు, భవనాల శాఖలో చీఫ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తనను అరెస్ట్ చేశారు పోలీసు అధికారులు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు. మోహన్ నాయక్. ఆయన 29 ఏళ్ల క్రితం ప్రభుత్వ ఉద్యోగంలో చేరారు. ఈ కాలంలో తను భారీ ఎత్తున సంపాదించారు. రూ82 లక్షల విలువైన 19 ఎకరాల భూమి, రూ. 7 కోట్ల విలువైన 7 ఫ్లాట్లు, రూ. 2.5 కోట్ల విలువైన ఒక ట్రిప్లెక్స్ విల్లా, నిర్మాణ దశలో ఉన్న మరో ఒకటి లేదా రెండు ఇళ్లు, సుమారు 60 బాటిళ్ల భారతీయ, విదేశీ మద్యం, రూ. 55 లక్షల నగదు, రూ. 1.44 కోట్ల బ్యాంక్ నిల్వ, 2.5 కిలోల బంగారం, రూ. 1.2 కోట్ల విలువైన గృహోపకరణాలు పట్టుబడ్డాయి.





