
కరూర్ ర్యాలీలో తొక్కిసలాట
చెన్నై : ప్రముఖ నటుడు టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కరూర్ లో చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఏకంగా 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొన ఊపిరితో కొట్టు మిట్టాడుతున్నట్లు సమాచారం. టీవీకే పార్టీ నిర్వాహకులు కరూర్ లో చిన్న స్థలాన్ని ఎంచుకోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మొత్తం ఘటన యావత్ దేశాన్ని విస్తు పోయేలా చేసింది. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై ఫోకస్ పెట్టారే తప్పా ఎలా ప్రచారం నిర్వహించాలనే దానిపై దృష్టి పెట్టక పోవడం దారుణం. ఇప్పటికే విజయ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఆయనను బాధ్యుడిగా చేయాలని డిమాండ్ చేస్తున్నారు డీఎంకే, ప్రతిపక్ష పార్టీల నేతలు.
ప్రాణాలు కోల్పోయిన వారిలో ఆరుగురు చిన్నారులు మృతి చెందగా 16 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా ఆస్పత్రుల పాలయ్యారు. కరూర్ తో పాటు చుట్టు పక్కల ఆస్పత్రులకు బాధితులను , క్షతగాత్రులను తరలించారు. తీవ్ర విషాదం నెలకొనడంతో టీవీకే విజయ్ తన ప్రసంగాన్ని నిలిపి వేసి వెళ్లి పోయారు. కనీసం చని పోయిన వారిని పరామర్శించిన పాపాన పోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఘటన తెలిసిన వెంటనే తీవ్రంగా స్పందించారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. బాధితులను పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై విచారణకు రిటైర్డ్ జస్టిస్ అరుణ జగదీశన్ ను నియమించారు.