తిరుపతి : తిరుపతి నగరానికి అతి సమీపంలో ఉన్న అప్పలాయగుంటలో వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో శాస్త్రోక్తంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల ఆరంభంలో ధ్వజారోహణం సందర్భంగా ఆహ్వానించిన సకల దేవతలను, గరుడ పటాన్ని అవనతం చేసి వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా సాగనంపారు. ఈ ధ్వజావరోహణంతో తొమ్మిది రోజుల పాటు సాగిన దివ్యోత్సవాలు విజయవంతంగా పరిసమాప్తమయ్యాయి.
ఉత్సవాల సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) ఆధ్వర్వంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున అప్పలాయగుంటలో నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలకు తరలి వచ్చారు. ఏ ఒక్క భక్తుడికి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లు చేయడంలో టీటీడీ సక్సెస్ అయ్యిందని తెలిపారు జేఈవో డాక్టర్ ఎ. శరత్. ఈ కార్యక్రమంలో టిటిడి జేఈవో తో పాటు ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈవో దేవరాజులు, ఆలయ అధికారులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఈ సమయంలో స్వామి వారిని దర్శించు కోవడం తో భక్త బాంధవులు తన్మయత్వానికి లోనయ్యారు.















