
పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలన్న సీఎం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జీఎస్టీ ఉత్సవ్ కార్యక్రమన్ని నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆదివారం టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఎం దిశా నిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరు ఇతర పార్టీల నేతలతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు. కార్యకర్తల భాగస్వామ్యంతో యోగాడే సక్సెస్ అయిందన్నారు సీఎం. అలాగే జీఎస్టీ ఉత్సవ్ ను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు . 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రారని, కానీ అదే వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు మాత్రం సభకు వస్తారని ఇదేం ద్వంద్వ వైఖరి అని ప్రశ్నించారు. ఇది పక్కా డ్రామా కాదా అని నిలదీశారు నారా చంద్రబాబు నాయుడు.
పార్టీ కార్యకర్తలైనా, నాయకులైనా ప్రజలకు ఎప్పుడూ దగ్గరగా ఉండాలన్నారు. మంచి చెడులను ప్రజలకు వివరించాలని కోరారు సీఎం. ఎన్నికల సమయంలోనే ప్రజల వద్దకు వెళ్తానంటే ప్రజలు హర్షించరని అన్నారు. గత ప్రభుత్వం విద్యుత్ శాఖను సంక్షోభంలోకి నెట్టేసిందని ఆరోపించారు. వైసీపీ అసమర్థ విధానాల వల్ల ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో భారం పడిందన్నారు. దీనికి మనం కారణం కాదన్నారు. 15 నెలల కాలంలో విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టామన్నారు. అనేక సమస్యలను పరిష్కరించామని తెలిపారు. ఇవాళ తక్కువ ధరకు విద్యుత్ కొనుగోళ్లు చేపట్టామన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా విద్యుత్ కొనుగోళ్లల్లో సుమారు రూ.1000 కోట్లు ఆదా చేశామన్నారు. రానున్న కాలంలో ప్రజలపై రూ.1000 కోట్ల భారాన్ని తగ్గిస్తున్నామన్నారు.