హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుకు షాక్ తగిలింది. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ లో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబు పై కేసు నమోదు చేశారు. . యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ మోసం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. యువకుడి తల్లిదండ్రుల దగ్గర్నుంచి మూడున్నర కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వాపోయారు బాధితులు. ఈ మేరకు వారు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబును విచారణకు పిలిపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సదరు యువకుడిని హీరోగా చేయకుండా డబ్బులు ఇవ్వక పోవడంతో విసిగి పోయిన బాధితులు చివరకు ఖాకీల వద్దకు వెళ్లారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించినట్లు టాక్. యువకుడి తండ్రి హనుమంతరావు ఇచ్చిన ఫిర్యాదు తో అశోక్ బాబుపై కేసు నమోదు.. నిర్మాత విజయలక్ష్మి, దర్శకుడు గుడ్లూరు అశోక్ బాబులను పిలిచి విచారిస్తున్నారు పోలీసులు. తమ కొడుకును హీరోగా చేస్తానని చెప్పి దర్శకుడు పలు దఫాలుగా డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. హీరోను చేయకపోగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వలేదంటూ వాపోయారు. ఇదిలా ఉండగా గుడ్లూరి అశోక్ బాబు తెలుగులో భాగమతి, పిల్ల జమిందార్, ఆకాశరామన్న లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.






