
ఆసియా కప్ తీసుకునేందుకు ఇండియా నిరాకరణ
దుబాయ్ : గత కొన్ని రోజులుగా కోట్లాది మంది అభిమానులను అలరిస్తూ వచ్చిన ఆసియా కప్ 2025 మెగా టోర్నీ ఆదివారం నాటితో ముగిసింది. ఈ సందర్బంగా కప్ హాట్ ఫెవరేట్ గా బరిలోకి నిలిచిన భారత జట్టు అందరూ అనుకున్నట్టుగానే ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంది. ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించింది. ఆడిని ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించింది. చివరకు ఫైనల్ మ్యాచ్ లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా కప్ ను అందుకునేందుకు ఒప్పుకోలేదు సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని టీం ఇండియా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బీసీసీఐ , టీం కెప్టెన్, హెడ్ కోచ్ గంభీర్ ల సమిష్టి నిర్ణయం మేరకు పాకిస్తాన్ జట్టుతో ఆడుతాం కానీ కరచాలనం చేసే ప్రసక్తి లేదని ఇప్పటికే ప్రకటించారు.
అంతే కాకుండా ఈ గెలుపను, విజయాన్ని, కప్ ను యావత్ భారత దేశానికి, పెహల్గామ్ బాధితులకు, ఆపరేషన్ సిందూర్ లో ప్రాణాలు కోల్పోయిన భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్. ఆసియా కప్ ముగిసిన అనంతరం కప్ ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది. ప్రస్తుతం ఆసియా కప్ ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీఏ) నిర్వహించింది. ఈ కౌన్సిల్ కు చైర్మన్ గా ఉన్నారు పాకిస్తాన్ దేశానికి చెందిన కేంద్ర మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ అయిన నఖ్వీ. ఆయన కప్ ను ఇచ్చేందుకు రాగా భారత జట్టు తీసుకునేందుకు రాలేదు. దీంతో తను తీవ్ర అసహనానికి గురయ్యాడు.