
అలంకారంలో శ్రీ మలయప్పస్వామి
తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు సోమవారం ఉదయం 8 గంటలకు శేషాచలాధీశుడు శ్రీ కోదండ రాముని అవతారంలో ధనుస్సు, బాణం ధరించి తన భక్తుడైన హనుమంతునిపై ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తిస్తుండగా, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు.`
హనుమంతుడు భగవత్ భక్తులలో అగ్రగణ్యుడు. రామాయణంలో మారుతి స్థానం అద్వితీయం. చతుర్వేద నిష్ణాతుడుగా, లంకాభీకరుడిగా ప్రసిద్ధుడైన ఆంజనేయుడు వేంకటాద్రి వాసుని మూపున వహించి దర్శనమిచ్చారు. గురు శిష్యులైన శ్రీరామ హనుమంతులు తత్త్వ వివేచన గావించిన మహనీయులు కనుక వాహ్య వాహక రూపంలో ఈ ఇరువురిని చూసిన వారికి పుణ్య ఫలం లభిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి.
సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీమలయప్ప స్వామివారు భక్తులను కటాక్షిస్తారు. రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. వాహనసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో మురళి కృష్ణ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.