
సీపీఐ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్
హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మపై సీపీఐ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బీజేపీకి చప్రాసీ లాగా పని చేస్తున్నాడని ఆరోపించారు. బీజేపీ నేతలు ఏం చెబితే దానికి గవర్నర్ తలాడిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 17 రాగానే హడావుడి చేయడం బీజేపీకి అలవాటుగా మారిందన్నారు. స్వతంత్ర ఉద్యమంలో ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త కూడా పాల్గొన లేదన్నారు. దేశ స్వతంత్రం కోసం 4500 మంది కమ్యూనిస్టులు ప్రాణాలు అర్పించారని చెప్పారు. మంగళవారం నారాయణ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో పాలన గాడి తప్పినా ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. దేశంలో కొలువు తీరిన మోదీ సర్కార్ 2014 నుంచి అన్ని వర్గాలను ఇబ్బందులకు గురి చేసేలా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత మోదీకే దక్కుతుందని ధ్వజమెత్తారు. దేశంలోని వనరులను విధ్వంసం చేయడం , ఆపై కొందరి ప్రయోజనాలకే పెద్దపీట వేయడం దారుణమన్నారు. అన్ని ప్రధాన ప్రాజెక్టులన్నీ గౌతమ్ అదానీ, అనిల్ అంబానీలకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర గవర్నర్ పై తాజాగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం రేపాయి.
రాష్ట్రానికి గవర్నర్ ఉన్నాడా లేడా అన్న అనుమానం కలుగుతోందన్నారు. బీజేపీ వాళ్లు ఏది చెబితే దానికి తల ఊపడం, ప్రభుత్వం ఏ ఫైల్ పంపిస్తే దానిపై సంతకం చేయడం తప్పా చేసింది ఏమీ లేదన్నారు.