
నల్గొండ, సూర్యాపేట, గజ్వేల్, సంగారెడ్డి బాధితుల గోస
హైదరాబాద్ : రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సోమవారం తెలంగాణ భవన్ లో తనను నల్గొండ, సూర్యాపేట జిల్లా, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల ఆర్‌ఆర్‌ఆర్ బాధితులు కలిశారు. తమ గోడు వెళ్ల బోసుకున్నారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు కేటీఆర్. నల్గొండలో రీజినల్ రింగ్ రోడ్డు వల్ల ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తామని కేంద్రంలోని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వంటి నేతలంతా హామీ ఇచ్చారని కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఇచ్చిన హామీల వల్లనే రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన రైతులు కాంగ్రెస్‌కు ఓట్లు వేసి ఆ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు రీజినల్ రింగ్ రోడ్డుతో రైతులకు తీవ్రంగా నష్టం చేస్తున్నదని ఆరోపించారు కేటీఆర్. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు ఓట్లు గెలిచి, సీట్లు గెలిచిన తర్వాత అందరినీ మర్చి పోయారంటూ ఎద్దేవా చేశారు. ఎక్కువ శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగానికి, ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయ రంగాన్ని సుభిక్షం చేశామని తమ పాలనలో అన్నారు. కానీ అందుకు భిన్నంగా ఇవాళ తమ పదవులను కాపాడుకునేందు కోసం, ఢిల్లీకి పైసలు పంపించడం కోసం కమిషన్ల దందా చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల కోసం అలైన్‌మెంట్‌ను అడ్డగోలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారని అయినా సీఎం స్పందించ లేదన్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల అంశాన్ని పార్లమెంట్‌లో, రాజ్యసభలో మాకున్న నలుగురు ఎంపీలతో లేవనెత్తుతాం అని చెప్పారు కేటీఆర్. అసెంబ్లీలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తామని ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ పెట్టే ధైర్యం లేదన్నారు. రీజినల్ రింగ్ రోడ్డు బాధితులంతా ఐకమత్యం ప్రదర్శిస్తే కాంగ్రెస్ పార్టీ స్వార్థపూరితంగా మార్చిన అలైన్‌మెంట్ వల్ల నష్టం జరగకుండా ఉంటుందన్నారు. నష్టపోతున్న అన్ని గ్రామాల ప్రజలు ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజెప్పాలని సూచించారు. గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచచ్చారు.