
ముందస్తు ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడంతో
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జరిగే అవార్డు ప్రదానోత్సవానికి వెళ్లలేక పోతున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ముందస్తు కమిట్‌మెంట్‌ల కారణంగా న్యూయార్క్‌లో జరిగే ప్రతిష్టాత్మక గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోతున్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో అత్యవసర రాజకీయ కార్యక్రమాలలో ఆయన పాల్గొనాల్సి ఉంది. ఎన్నికల సంబంధిత సన్నాహక సమావేశాల కారణంగా 24న బుధవారం న్యూయార్క్ నగరంలో జరగనున్న గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025 వేడుకకు హాజరు కాలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేశారు కేటీఆర్.
ఈ ప్రతిష్టాత్మక అవార్డు గ్రహీతగా ఎంపికైన ఆయన ఇలా అన్నారు. UN జనరల్ అసెంబ్లీతో పాటు క్లైమేట్ వీక్‌లో భాగంగా నిర్వహించబడిన 9వ NYC గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో గ్రీన్ లీడర్‌షిప్ అవార్డు 2025కి ఎంపిక కావడం నిజంగా ఆనందంగా ఉందన్నారు. . ఈ గుర్తింపు మాజీ CM KCR , BRS ప్రభుత్వం నాయకత్వంలో తెలంగాణ ప్రతిష్టాత్మకమైన హరిత ప్రయాణానికి దక్కిన గౌరవంగా తాను భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. మునుపటి కమిట్‌మెంట్‌ల కారణంగా న్యూయార్క్‌లో జరిగే అవార్డు ప్రదానోత్సవానికి తాను హాజరు కాలేక పోతున్నందుకు బాధగా ఉందని పేర్కొన్నారు. పచ్చని వాతావరణానికి అనుకూలంగా ఉండే తెలంగాణను నిర్మించడానికి BRS ప్రభుత్వం చేస్తున్న సమిష్టి ప్రయత్నాలకు ఈ గౌరవాన్ని నిదర్శనంగా భావిస్తున్నానని ఆయన అన్నారు.