
శాసన సభలో కీలక ప్రకటన చేసిన వ్యవసాయ మంత్రి
హైదరాబాద్ : రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. వైసీపీ హయాంలో ప్రమాదాలకు గురై మరణించిన 63 మంది మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం నష్ట పరిహారాన్ని అంద చేయడం జరిగిందని చెప్పారు. అంతే కాకుండా మరో 100 మంది మృతి చెందిన వారికి త్వరలోనే పరిహారాన్ని అందచేస్తామన్నారు. ఆధ్వానంగా తయారైన మత్స్యకారుల జీవితాల్లో పూర్వ వైభవం తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. వారికి కావలసిన మౌలిక సదుపాయాలను నచ్చిన విధంగా అందచేస్తామని తెలిపారు అచ్చెన్నాయుడు.
కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో రూ. 4000 ఖర్చుతో ప్రతి బోట్ కు శాటిలైట్ ట్రాన్స్పాండర్ లను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి వల్ల చేపలు ఎక్కడ ఉన్నాయో సులువుగా తెలుసుకునేందుకు వీలు కలుగు తుందన్నారు. అంతే కాకుండా ప్రమాదాలను ముందుగానే గుర్తించ వచ్చన్నారు. ఎన్ ఎఫ్ డీ బీ ఇన్యూరెన్స్ పథకంలో భాగస్వామ్యం అయ్యి ప్రమాదవశాత్తు మరణించిన మత్స్యకారులకు 10 లక్షలు పరిహారం అందేలా చర్యలు చేపడుతన్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాలలో జీవించే మత్స్యకారులకు అన్ని సదుపాయాలను అందచేస్తామని ప్రకటించారు అచ్చెన్నాయుడు. సీడ్ వీడ్ కల్చర్ అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. ఇప్పటికే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సీడ్ కల్చర్ అభివృద్ధి చేసేందుకు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని తెలిపారు.