
సురక్షితంగా బస్టాండు నుంచి ప్రయాణికుల తరలింపు
హైదరాబాద్ : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి విల విల లాడుతోంది హైదరాబాద్ నగరం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. కుండ పోత దెబ్బకు మూసీ పొంగి పొర్లుతోంది. నీటి వరద దెబ్బకు మూసారాంబాగ్, ఛాదర్ ఘట్ , రాజేంద్ర నగర్, కీసర, తదితర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రహదారులన్నీ జలమయం అయ్యాయి. కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచి పోయాయి. మరో రెండు రోజుల పాటు భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. దీంతో మూసీ ప్రవాహనికి నగరంలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్ ) నీట మునిగింది. వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణీకులు చిక్కుకు పోయారు. దీంతో సురక్షితంగా బయటకు తరలించారు ఆర్టీసీ అధికారులు.
మరో వైపు నగరం వెలుపుల నుంచి ఆర్టీసీ బస్సులను నడుపుతోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఓ వైపు వర్షాలు కురుస్తున్న సమయంలో ఎండీ సజ్జనార్ ను బదిలీ చేసింది సర్కార్. ఆయన స్థానంలో నాగిరెడ్డిని నియమించింది. ఇదిలా ఉండగా ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ నిజామాబాద్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుండి బయలు దేరుతున్నాయి. వరంగల్, హన్మకొండకు వెళ్లే బస్సులను ఉప్పల్ క్రాస్‌రోడ్స్ నుండి నడుస్తున్నాయి. సూర్యాపేట, నల్గొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుండి బయలు దేరుతున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూలు, బెంగళూరుకు సర్వీసులు ఆరాంఘర్ నుండి నడుస్తున్నాయి. వరదల దృష్ట్యా ప్రయాణికులు ఎంజీబీఎస్ కు రావద్దంటూ ఆర్టీసీ కోరింది. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ బోర్డింగ్ పాయింట్లను ఉపయోగించాలని సూచించింది. ప్రయాణికులు RTC 040-69440000, 040-23450033. కాల్ సెంటర్ నంబర్లను సంప్రదించాలని కోరింది