ప్రశంసలు కురిపించిన లెజెండ్ క్రికెటర్
ముంబై : భారతీయ స్టార్ యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా. తను ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025లో అద్బుతంగా రాణించాడు. అంతే కాదు ఇండియా కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో వణుకు పుట్టించాడు. ఇదిలా ఉండగా ముంబై వేదికగా సియట్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి టాప్ ఇండియా, విదేశీ క్రికెటర్లు హాజరయ్యారు. రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ , సంజూ శాంసన్ , వరుణ్ చక్రవర్తితో పాటు బ్రియాన్ లారా కూడా ఉన్నాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడాడు లారా.
ప్రత్యేకంగా అభిషేక్ శర్మ గురించి ప్రస్తావించాడు. తను నాకు సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) నుండి తెలుసు అన్నాడు లారా. నేను COVID కాలంలో అక్కడ ఉన్నాను, బహుశా మూడు, నాలుగు సంవత్సరాల క్రితం నుంచి చూస్తూ వస్తున్నా. తను పెరిగిన, ఆడుతున్న ఆట తీరు తనను ఆశ్చర్య పోయేలా చేసిందన్నాడు. అతను చాలా ప్రత్యేకమైన వ్యక్తి. యువరాజ్ సింగ్ అతనిపై ఫోకస్ పెట్టాడని చెప్పాడు. అతని బ్యాట్ వేగం, అతను బంతిని కొట్టే విధానంపై పెద్ద ప్రభావాన్ని చూపాడని పేర్కొన్నాడు. అభిషేక్ శర్మ T20 క్రికెట్‌లో బాగా ఆడుతున్నాడని, బహుశా 50 ఓవర్ల ఫార్మాట్‌లో కూడా రాణిస్తాడన్న నమ్మకం తనకు ఉందన్నాడు. అయితే ఇంకా ట్రై చేస్తే రాబోయే కాలంలో టెస్టు క్రికెట్ లోకి కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉందని పేర్కొన్నాడు.








