సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత రహదారుల భద్రతపై కీలక సూచనలు చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రోడ్ సేఫ్టీపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న ట్రాఫిక్ చలానా సిస్టమ్ తో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు నిర్వహణ అంశాలపై రోడ్ సేఫ్టీ ఏడీజీ శ్రీ కృపానంద త్రిపాఠి , రోడ్ సేఫ్టీ డీఐజీ విజయరావు , ఐపీఎస్ మల్లికా గార్గ్ , ఇతర అధికారులతో చర్చించారు హోం మంత్రి. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణ కోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తగిన ఆదేశాల ఇవ్వడం జరిగింది.
రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వంగలపూడి అనిత సూచించారు. ప్రతి నిత్యం వేలాది మంది రహదారులపై ప్రయాణం చేస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టాలని అన్నారు వంగలపూడి అనిత. అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రోడ్ సేఫ్టీపై అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు. దీని వల్ల కొంతలో కొంతైనా ప్రమాదాల బారి నుండి కాపాడుకునేందుకు వీలు కలుగుతుందన్నారు.






