లైజనింగ్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహణ
నంద్యాల జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్. కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్నారు. 1800 మందికి పైగా పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది విధుల్లో పాలు పంచుకుంటారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. ప్రధానమంత్రి హెలిపాడ్ వద్దకు చేరుకున్నప్పటి నుండి దర్శనం అనంతరం తిరిగి వెళ్లే వరకు ఆయన పర్యటించే ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమైన ప్రాంతాలలో, కూడళ్లలో సాయిధ బలగాలతో పికెట్లను ఏర్పాటు చేసి భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగిందని చెప్పారు.
బందోబస్తుకు వచ్చిన సిబ్బందిని 10 సెక్టార్లుగా విభజించామన్నారు. ప్రతి సెక్టార్ కు ఒక ఉన్నతాధికారిని ఇన్చార్జిగా నియమించినట్లు తెలిపారు. జియో గ్రాఫికల్ మ్యాప్ ద్వారా ప్రధాని పర్యటించే ప్రాంతాలలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను క్షుణ్ణంగా సిబ్బందికి జిల్లా ఎస్పీ వివరించారు. ప్రధాని మంత్రికి సెక్యూరిటీ పరంగా భారీ భద్రత ఉంటుందన్నారు ఎస్పీ. రోడ్డు మార్గాలలో, ముఖ్యమైన కూడళ్లలో ,గుడి పరిసర ప్రాంతాలలో రూప్ టాప్ సిబ్బందిని నియమించామన్నారు. వారికి బైనాక్యులర్ తో నిరంతరం పరిశీలించాలని ఆదేశించామన్నారు. శ్రీశైలానికి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇది 24/7 కొనసాగించాలన్నారు. కమాండ్ కంట్రోల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ కెమెరాలను పరిశీలించాలని, ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించాలన్నారు.






