క్రికెట్ మ్యాచ్ ఆడిన ఉద్యోగులు, సిబ్బంది
హైదరాబాద్ : నగర ప్రజలకు మెరుగైన జీవనాన్ని అందించడానికి నిత్యం శ్రమించే హైడ్రా క్రికెట్ ఆటతో సేదదీరింది. వర్షాకాలం వరద కష్టాలు తీర్చడంలో తలమునకలైన హైడ్రా క్రికెట్ ఆడి సందడిగా గడిపింది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో క్రికెట్ ఆటతో ఎంజాయ్ చేసింది. ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువులు, నాలాలు, రహదారులతో పాటు ప్రజావసరాల ఉద్దేశించిన స్థలాలను కాపాడడంలో క్షణం తీరిక లేకుండా వున్న హైడ్రా సిబ్బంది క్రికెట్ ఆటలో బ్యాటుతో సిక్సర్ల వర్షం కురిపించారు, బౌలింగ్ లో పిడుగులాంటి బాల్స్ వేసి వికెట్లు పడగొట్టారు. హైడ్రాలో అసెట్స్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాలు రెండు జట్లుగా రంగంలో దిగి నువ్వా నేనా అనేట్టు క్రికెట్లో పోటీ పడ్డాయి.
హైడ్రా కమిషనర్ రంగనాథ్ , హైడ్రా అదనపు కమిషనర్ ఎన్. అశోక్ కుమార్, హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య , హైడ్రా అదనపు కమిషనర్ అడ్మిన్ ఆర్. సుదర్శన్ ఈ జట్లకు నాయకత్వం వహించారు. వీరి నేతృత్వంలోని క్రికెట్ జట్లు నువ్వా నేనా అనేట్టు పోటీ పడ్డాయి. హైడ్రా అదనపు కమిషనర్ అడ్మిన్ సుదర్శన్ బౌలింగ్ చేయాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ , అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసి పరుగుల వర్షం కురిపించారు. హైడ్రా అదనపు కమిషనర్ అశోక్ కుమార్ అంపైరింగ్ చేసారు. ఫ
తుల్గుడాలోని హైడ్రా క్రీడమైదానంలో ఫ్లడ్ లైట్ల కాంతిలో హైడ్రా క్రికెట్ ఆట సందడిగా సాగింది. హైడ్రా పీఆర్వో వేణుగోపాల నాయుడు క్రికెట్ కామెంట్రీ ఆటగాళ్లతో పాటు ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపింది.అర్థరాత్రి వరకు జరిగిన క్రికెట్ ఆటలో హైడ్రాలో పని చేస్తున్న సిబ్బంది మొత్తం సేదదీరింది. చక్కటి సమన్వయంతో కలసికట్టుగా పని చేసేందుకు క్రీడలు దోహదం చేస్తాయని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. నిత్యం ఇదే స్ఫూర్తితో, ఉత్సాహంతో పని చేసి నగర ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.








