ప్రజా వాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి
హైదరాబాద్ : కబ్జాలపై హైడ్రాకు 52 ఫిర్యాదులు అందాయి. ఆక్రమణలపై, కబ్జాలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫోకస్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ, మండలంలోని బీరంగూడలో ఉన్న శాంబుని కుంట కబ్జాలకు గురి అవుతోందని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. సర్వే నంబరు 756లో ఉన్న ఈ చెరువు వాస్తవ విస్తీర్ణం 22.11 ఎకరాలు కాగా.. ప్రస్తుతతం ఆరేడు ఎకరాలకు పరిమితమైందని వాపోయారు. చెరువులో మట్టిపోసి ఆక్రమణలకు పాల్పడుతున్నారని హైడ్రా చర్యలు తీసుకోకపోతే ఆ చెరువు కనుమరుగౌతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.సాగర్‌రోడ్డులో ఉన్న యశోదనగర్ కాలనీలో శివారు ఇంటి స్థలాల వారు రోడ్డును కలిపేసుకుని దారి లేకుండా చేస్తున్నారని యశోదనగర్ కాలనీ రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. మరో రోడ్డును ఆక్రమించేసి 107 గజాల ప్లాట్ స్థలంగా చూపిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో లే ఔట్లోని రహదారులు దాటాలంటేనే కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు.
కూకట్పల్లి ప్రాంతంలో పరికి చెరువులో సుమారు 12 ఎకరాల మేర రాత్రికి రాత్రి మట్టిపోసి నింపుతున్నారని.. నంబరు ప్లేటు లేని వాహనాలను వినియోగిస్తున్నారని అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. 18 అంతస్తుల అపార్టుమెంట్ ను నిర్మించి అమ్మేసేందుకు సిద్ధం అవుతున్నారని.. వెంటనే హైడ్రా ఆపాలని కోరారు. లేని పక్షంలో అందులో ప్లాట్లు కొన్న వారు మోసపోయే ప్రమాదం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అమీన్పూర్ పెద్ద చెరువులోకూడా మట్టిపోసి.. భవన నిర్మాణాలు చేపడుతున్నారని.. అడ్డుకున్న తమపై దాడి చేయడమే కాకుండా.. స్థానిక పోలీసు స్టేషన్లో కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు.
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని బాలానగర్ మండలం, హస్మత్‌పేట్ గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ఆక్రమణలపై ఓల్డ్ బోయిన్పల్లి నివాసులు హైడ్రా ప్రజావాణి లో ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 1లోని 28.28 ఎకరాల ప్రభుత్వ భూమిని స్థానిక రాజకీయ నాయకులు ఆక్రమించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజాం కాలం నాటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ భూమిని 1953లో పురావస్తు శాఖ గజిట్ బుక్ లో కూడా యాడ్ చేసింది. కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన స్థానిక నాయకులతో పాటు వారి అనుచరులు ఈ భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మలచి చిన్నచిన్న ప్లాట్లుగా అమ్మేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.






