పిన్నెల్లి సోదరుల పాపం పండింది

VijayaBhaskar · November 29, 2025
Spread the love

ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

నెల్లూరు జిల్లా : బ‌డుగు బలహీన వర్గాలను హింసించి హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకులు పిన్నెల్లి సోదరులు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాచ‌ర్ల ఎమ్మెల్యే జూల‌కంటి బ్ర‌హ్మానంద రెడ్డి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కన్నూమిన్నూ కానకుండా పేట్రేగిపోయిన అరాచక శక్తి పిన్నెల్లి కుటుంబం అని ఆరోపించారు. మాచర్ల నియోజకవర్గాన్ని రావణకాష్ఠంలా మార్చేసి, తాలిబన్లలా ప్రతిపక్షాలు, ప్రజలపై దారుణ దమనకాండకు తెగబడ్డ దౌర్జన్యకారులు పిన్నెల్లి సోదరులు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మాచర్ల నియోజకవర్గాన్ని ఆటవిక రాజ్యంలా, అరాచకాలకు అడ్డాగా మార్చేశారని ధ్వ‌జ‌మెత్తారు. సహజ వనరులన్నింటినీ దోచుకున్నారని వాపోఆరు. మాఫియానే నడిపించారు. నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేకుండా నిర్మూలించాలన్నట్టుగా బరితెగించారని మండిప‌డ్డారు.

ఎందరో తెదేపా కార్యకర్తలు దారుణ హత్యకు గురయ్యారని ఆవేద‌న చెందారు. జగన్ మోహన్‌రెడ్డి అండతో వ్యవస్థలన్నింటినీ గుప్పిట్లో పెట్టుకుని పేట్రేగిపోయారు. మాచర్లలో గత ఐదేళ్లలో పిన్నెల్లి రాజ్యాంగం, చట్టమే అమలైందన్నారు. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు జూల‌కంటి బ్ర‌హ్మానంద రెడ్డి. పోలింగ్‌ కేంద్రంలోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేశారు, సీఐపైనే హత్యాయత్నం చేసి బరితెగించారు. ఐదేళ్ల పాటు మాచర్ల, గురజాల, నరసరావుపేట ప్రాంతాలను తమ వ్యక్తిగత జాగీరుగా మార్చుకుని, బడుగు-బలహీన వర్గాల ప్రజల గొంతు నొక్కి, రక్తం తాగిన ఈ ఇద్దరు నరరూప రాక్షసులు ఈ రోజు చట్టం ముందు అడ్డంగా దొరికిపోయారని అన్నారు.