కేంద్ర సర్కార్ పై ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్ : కేవలం బడా బాబులకు, ధనవంతులకు, అదానీ, అంబానీ, టాటా, జిందాల్ కంపెనీల కోసమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ ఖగార్ చేపట్టిందని సంచలన ఆరోపణలు చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్నది హింస కాదా అని ప్రశ్నించారు. మావోయిస్టులు వారి కోసం పోరాడటం లేదని, ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమిస్తున్నారని చెప్పారు. ప్రశ్నించడం నేరమని అనుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
బీజేపీ అభివృద్ధిని, దుర్మార్గాలను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్స్ అంటున్నారు, మీకు ఎదురు తిరిగిన వారు అందరూ నక్సలైట్స్ అవుతారా అని నిలదీశారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను. కేవలం ఖనిజ వనరులను తవ్వుకొని ధనికులను మరింత ధనవంతులుగా మార్చేందుకు ఆపరేషన్ ఖగార్ మొదలు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి ఆపరేషన్ల వల్ల ఉద్యమాలు, పోరాటాలు ఆగవని స్పష్టం చేశారు. దీనిని కేంద్రం గుర్తిస్తే మంచిదని హితవు పలికారు.






