ఆదేశించినట్లు ప్రకటించిన బీఆర్ నాయుడు
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. గత జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటైన టీటీడీ పాలక మండలి పలు అక్రమాలకు పాల్పడినట్లు తెలిపారు. బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తాజాగా టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శాలువాల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పాలక మండలి సమావేశంలో తెలియ చేశారని అన్నారు. ఈ మేరకు మొత్తం కొనుగోళ్లకు సంబంధించిన వ్యవహారంపై విచారణ చేపట్టామన్నారు. దీంతో సంచలన విషయాలు వెలుగు చూశాయన్నారు. బయట ధర రూ. 350 ఉండగా గత పాలక మండలి ఏకంగా ఒక్కో శాలువాను రూ. 1350 కు కొనుగోలు చేసినట్లు డబ్బులు డ్రా చేశారంటూ ఆరోపించారు. దాదాపు రూ. 80 నుంచి 90 కోట్ల మేర కుంభకోణం జరిగి ఉండవచ్చని తాము అంచనా వేశామన్నారు.
ఈ మేరకు శాలువాల కొనుగోళ్లకు సంబంధించి ఏసీబీతో విచారణకు ఆదేశించినట్లు ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. నివేదిక వచ్చిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధ్యులైన అధికారులపై ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభం అయ్యిందన్నారు. గత ప్రభుత్వ కాలంలో కల్తీ నెయ్యి, నాసిరకం సరుకులు, పరకామణి చోరీ, టెండర్ల మార్పిడి వంటి అనేక అవినీతి కేసులు బయట పడ్డాయన్నారు. ఇవన్నీ దశల వారీగా బయటపెట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు బీఆరర్ నాయుడు.






