తిరుమలలో ప్రయోగాత్మకంగా రీసైకిల్ మిషన్లు

VijayaBhaskar · December 12, 2025
Spread the love

ఏర్పాటుపై అదనపు ఈవో వెంక‌య్య చౌద‌రి సమీక్ష

తిరుమల : తిరుమ‌ల పుణ్య క్షేత్రంలో ప‌ర్యావ‌ర‌ణానికి భంగం క‌లిగించ‌కుండా చ‌ర్య‌లు చేప‌డుతోంది టీటీడీ. ఇందులో భాగంగా రీసైకిల్ మిషన్ల ఏర్పాటుపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో ప్రయోగాత్మకంగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-5 లో ఏర్పాటు చేసిన రెక్లెయిమ్ డిపాజిట్ రీఫండ్ మిషన్లకు విశేష స్పందన వ‌చ్చింద‌న్నారు. దీంతో తిరుమలలో ఈ మిషన్లను మరి కొన్నింటిని పరిశీలనాత్మకంగా ఏర్పాటు చేయాలని స్ప‌ష్టం చేశారు.

తిరుమలలో టెట్రాపాక్, టిన్ లలో పానీయాలను స్వీకరించిన అనంతరం భక్తులు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఈ డిపాజిట్ రీఫండ్ మెషిన్ల లో వేస్తే తిరుమలలో పరిశుభ్రత మరింత మెరుగు పడేందుకు దోహద పడుతుందని సీహెచ్ వెంక‌య్య చౌద‌రి అన్నారు. ఈ విషయం పై తిరుమలలోని వ్యాపారులు, టెట్రా ప్యాక్ డీలర్లు కూడా తోటి వారిలో అవగాహన కల్పించాలని కోరారు. స్వచ్ఛ తిరుమలలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడంలో భాగంగా ఒక ఉద్యమంలా రెక్లైమ్ రీసైకిల్ మెషిన్లపై భక్తులకు విస్తృతంగా అవగాహన కల్పించాల‌ని సూచించారు. తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో మరిన్ని మెషిన్ల ఏర్పాటుకు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఆదేశించారు.