స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుమల : దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యాధునిక వసతి సౌకర్యాలతో స్విమ్స్ ను అభివృద్ది చేస్తామని ప్రకటించారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. స్విమ్స్ మెయిన్ బిల్డింగ్లో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అనంతరం అన్ని ల్యాబ్లను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చి సెంట్రల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.శ్రీ పద్మావతి ఆసుపత్రి ఎదుట గల మెడికల్ షాపును స్విమ్స్ ఆధ్వర్యంలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు టిటిడి ఆధ్వర్యంలోని అన్ని ఆసుపత్రుల్లో రోగులకు మరిన్నిమెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు బీఆర్ నాయుడు.
స్విమ్స్ సంచాలకులు, ఉప కులపతి డాక్టర్ ఆర్వీ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్ ఆధ్వర్యంలో స్విమ్స్ లో పలు భవనాల నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇందులో భాగంగా స్విమ్స్ యూనివర్సిటీ విద్యార్థుల కోసం ఏడాది క్రితం 150 గదులతో హాస్టల్ భవనాలు ప్రారంభించామన్నారు. రెండో దశలో సెంట్రల్ మెడికల్ గోడౌన్, రోగుల సహాయకుల కోసం అదనపు అంతస్తులను ప్రారంభించామని చెప్పారు. అతి త్వరలోనే టిటిడి సహకారంతో స్టాఫ్ క్వార్టర్స్, సెంట్రల్ కిచన్, 350 అదనపు పడకలు, 5 ఆపరేషన్ థియేటర్లు, 5 ఐసియులతో అడ్వాన్స్ క్యాన్సర్ కేర్ సెంటర్ భవనాలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమాల్లో టిటిడి బోర్డు సభ్యులు సదాశివరావు, శాంతారాం, నరేష్కుమార్, టిటిడి జెఈవో వీరబ్రహ్మం, బర్డ్ డైరెక్టర్ డాక్టర్ జి.జగదీష్, చీఫ్ ఇంజినీర్ టివి. సత్యనారాయణ, స్విమ్స్ (టిటిడి) ఇంజినీర్లు ప్రసాద్, పార్థసారథి, బాలాజి తదితర ఇంజినీరింగ్ సిబ్బంది, తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ, తిరుపతి నగర డిప్యూటీ మేయర్ ఆర్. సి. మునికృష్ణ , ఇతర నాయకులు, టిటిడి, స్విమ్స్ ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.








