వైకుంఠ ద్వార దర్శనం కోసం
తిరుపతి జిల్లా : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి, తిరుమలతో పాటు జిల్లా లోని ఇతర దేవాలయాలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలు, డ్రోన్‌లతో 24×7 నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. నకిలీ టోకెన్లు జారీ చేసినా లేదా నకిలీ టోకెన్లతో వచ్చినా సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. భక్తులు ఎలాంటి మధ్యవర్తులు, అనధికార వ్యక్తులను నమ్మకుండా నకిలీ టోకెన్లను తీసుకుని మోసపోవద్దని సూచించారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా సుమారు 3000 మంది పోలీస్ అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుమలలో రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా సీసీ కెమెరాలతో, తిరుపతిలోని బస్టాండ్, అలిపిరి, శ్రీవారి మెట్లు తదితర ముఖ్య ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ సంవత్సరం మొదటి మూడు రోజులకు భక్తులకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా టోకెన్లు జారీ చేయడం జరిగిందన్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు నకిలీ టోకెన్లు జారీ చేసి భక్తులను మోసం చేస్తున్నారని తెలిపారు. నకిలీ టోకెన్లతో వచ్చిన భక్తులకు అనుమతి ఉండదని, నకిలీ టోకెన్లు ఇచ్చిన వారిపైనా, తీసుకొచ్చిన వారిపైనా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.







