సంచలన ప్రకటన చేసిన ఈవో సింఘాల్
తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఈవోగా కొలువు తీరాక టీటీడీలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. జనవరి 9వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ విధానంలో శ్రీవాణి టోకెన్లు జారీ చేయన్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు ఆన్ లైన్ లో టోకెన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు ఈవో. టోకెన్లు పొందిన భక్తులు సాయంత్రం 4 గంటలకు రిపోర్టు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
దీనిని ప్రయోగాత్మకంగా నెల రోజుల పాటు చేస్తామన్నారు. అయితే రేణిగుంట ఎయిర్ పోర్టులో యధావిధిగా శ్రీవాణి టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలిపారు.
అయితే శ్రీవాణి టోకెన్లకు సంబంధించి ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు (మొత్తం నలుగురు) మాత్రమే టికెట్ బుకింగ్‌కు అనుమతి ఉంటుందని పేర్కొన్నారు ఈవో. టికెట్ల బుకింగ్ లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి చేశామన్నారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వడ్ విధానంలో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చు అని తెలిపారు. తద్వారా ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూలైన్ లో నిరీక్షించే సమస్య తొలగి పోతుందన్నారు. అదేవిధంగా రోజుకు 500 శ్రీవాణి దర్శన టికెట్లను ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్ విధానంలో ఇప్పటికే విడుదల చేయడం జరిగిందన్నారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. మూడు నెలల అనంతరం ఈ విధానంపై సమీక్షించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు.
తిరుపతి విమానాశ్రయంలో ప్రతిరోజూ భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో జారీ చేస్తున్న 200 టికెట్ల జారీ విధానం కూడా యథావిధిగా కొనసాగనుందని, ఇందులో ఎలాంటి మార్పు చేయలేదన్నారు. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని గమనించి భక్తులు తమ దర్శన ప్రణాళికలను రూపొందిచు కోవాలని కోరారు ఈవో.








