టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పిలుపు
తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవితంలో అత్యంత విలువైనది బాల్యం అన్నారు. విద్యను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు.
తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని స్పష్టం చేశారు. శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్నారు బీఆర్ నాయుడు. ఈ సందర్బంగా డే స్కాలర్స్‌కు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. ఆకలి అనేది లేకుండా అన్న ప్రసాదం అందజేయడం ఆనందంగా ఉందన్నారు బీఆర్ నాయుడు. ఈ పథకం ద్వారా 436 మంది విద్యార్థినులకు లబ్ది చేకూరనుందని చెప్పారు.
ఇంటర్మీడియట్ దశ భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ప్రతి విద్యార్థిని లక్ష్యంతో, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరం 97% ఫలితాలు సాధించిన కళాశాల ఈసారి 100% ఫలితాలతో మరింత మెరుగ్గా రాణించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు బీఆర్ నాయుడు. జాతీయ స్థాయిలో క్రీడల్లో ప్రతిభ చూపిన విద్యార్థినులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు పనబాక లక్ష్మీ, జి. భానుప్రకాష్ రెడ్డి, ఎస్. శాంతారామ్, నరేష్ కుమార్, డీఈవో డా. టి. వేంకట సునీలు, కళాశాల అధ్యాపకులు, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు.








