సీఎంకు ద‌మ్ముంటే త‌న బావ‌మ‌రిదిపై సిట్ వేయాలి

VijayaBhaskar · January 24, 2026
Spread the love

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు
హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కావాల‌ని సిట్ పేరుతో త‌మ‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. తాము ఎలాంటి తప్పు చేయ‌లేద‌న్నారు. కేవ‌లం ప్ర‌భుత్వ ప‌రంగా వైఫ‌ల్యాల‌ను కప్పి పుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కు తెర లేపాడంటూ ధ్వ‌జ‌మెత్తారు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే తన బావమరిది సృజ‌న్ రెడ్డిపై సిట్ వేయాలని ఆయ‌న డిమాండ్ చేశారు. కేంద్ర బొగ్గు గ‌నుల శాఖ మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డి ఎందుకు ఈ విష‌యంలో మౌనంగా ఉన్నారో చెప్పాల‌న్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్రంలో ఒక్క‌ట‌య్యాయ‌ని ఆరోపించారు.

అందుకే క‌లిసిక‌ట్టుగా సింగ‌రేణి బొగ్గు గ‌నుల వ్య‌వ‌హారంలో భారీ కుంభ‌కోణానికి పాల్ప‌డ్డారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు త‌న్నీరు హ‌రీశ్ రావు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో పెద్ద ఎత్తున డ‌బ్బులు చేతులు మారాయ‌ని, కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ విచార‌ణ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫెవికాల్ బంధం లేకపోతే ఇప్పటి వరకూ పిలిచిన అన్ని టెండర్లు రద్దు చేసి, విచారణ చేయించాలని కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. నాకు, కేటీఆర్ కు ఎన్ని నోటీసులు ఇచ్చినా, కేసులు పెట్టినా భయపడం అని వార్నింగ్ ఇచ‌చ్చారు హ‌రీష్ రావు.