తిరుమల లడ్డూకి కల్తీ నెయ్యి వాడారని ఆరోపణ
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని సిట్ నివేదిక తేల్చిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు కొండల వాడికి రెండు కొండలు చాలు అన్న ఆలోచనా విధానం నుంచి, శ్రీ వెంకటేశ్వర స్వామికి ఉన్నది రెండే కొండలు అన్న వారసత్వం నుంచి పుట్టినవారు తిరుమల పవిత్రతను దిగజార్చేందుకు ఏ స్థాయికైనా దిగజారుతారని స్పష్టం చేశారు. వారు భగవంతుడి మీదే పగ పట్టారన్నారు. భగవంతుడి మీద పగ పట్టిన వారు మట్టికొట్టుకు పోతారని పేర్కొన్నారు . కల్తీ నెయ్యి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యి అసలు పాల నుంచి చేసిందే కాదని రిపోర్టులో పేర్కొన్నట్టు చెప్పారు. చేసిన తప్పుకి క్షమాపణ కోరకుండా ఎదురు మమ్మల్ని క్షమాపణ చెప్పమని బుకాయిస్తున్నారన్నారు.
ఇది హిందూ విశ్వాసాల మీద జరిగిన దాడి. తప్పు చేసిన వారు ఏడుకొండల వాడికి క్షమాపణ చెప్పి తీరాల్సిందేనని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. కల్తీ నెయ్యి కేసులో దోషుల్లో ఏ ఒక్కరినీ కూటమి ప్రభుత్వం వదలదని హెచ్చరించారు. మతం, ధర్మం చాలా లోతైన అంశాలు. చాలా సున్నితమైనవి కూడా. అలాంటి వ్యవహారాల్లో ఒక్క మాట మాట్లాడాలన్నా చాలా ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యమంత్రి , మేము కూడా మాట్లాడే సమయంలో సంయమనంతో, ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కోవాలి అన్నది ఆలోచించే మాట్లాడుతాం అని అన్నారు పవన్ కళ్యాణ్.






