చేనేత‌న్న‌ల‌కు రూ. 495 కోట్ల పెన్ష‌న్లు : ఎస్. స‌విత‌

VijayaBhaskar · February 14, 2026
Spread the love

శాస‌న మండ‌లిలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వెల్ల‌డి

అమ‌రావ‌తి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్ర ఎస్. స‌విత సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శాస‌న మండ‌లిలో స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు. గ‌తంలో జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ నేత‌న్న‌ల గురించి ప‌ట్టంచు కోలేద‌ని ఆరోపించారు. 50 ఏళ్లు నిండిన నేతన్నలకు పెన్షన్లు ఇచ్చిన ఘనత సీఎం చంద్ర బాబుదేనని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత‌ నేతన్నలకు ఇచ్చే పెన్షన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంచామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో 50 ఏళ్లు దాటిన నేత‌న్న‌ల‌కు రూ.495 కోట్లు పెన్షన్ల రూపంలో అందజేశామని వెల్లడించారు.

నేతన్నల కష్టాలకు గత ప్రభుత్వమే కారణమని మంత్రి సవిత స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఆప్కోను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. ఆప్కో పేరుతో కేంద్రం నుంచి తీసుకొచ్చిన రూ.120 కోట్లు గత దారి మళ్లించిందని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఆ నిధులు ఏవిధంగా వాడారో కూడా తెలియడం లేదన్నారు. దారి మళ్లిన రూ.120 కోట్లను రాబట్టడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకు పోతోందని స్పష్టం చేశారు. ఏళ్ల తరబడి ఆప్కోలో మురుగు పోతున్న పాత స్టాక్ ను తొలగించి కొత్తగా కొనుగోలు చేసిన వస్త్రాలను అమ్మకాలకు పెడుతున్నామన్నారు.