newsseals.com
News

పోలీసుల‌కు మాన‌సిక ఉల్లాసం అవ‌స‌రం

VijayaBhaskar February 20, 2026
newsseals-AnithaVangalapudi
Spread the love

స్ప‌ష్టం చేసిన మంత్రి వంగ‌ల‌పూడి అనిత

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విధి నిర్వ‌హ‌ణ‌లో రేయింబ‌వ‌ళ్లు ప‌ని చేస్తుంటార‌ని వారి చేస్తున్న సేవ‌ల గురించి ఎంత చెప్పినా తక్కువేన‌ని అన్నారు. శుక్ర‌వారం అమరావతిలోని మంగళగిరి 6వ బెటాలియన్ APSP వేదికగా జరిగిన “రెండవ ఆల్ ఇండియా పోలీస్ సౌత్ జోన్ టి20 క్రికెట్ టోర్నమెంట్”ను ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఘనంగా ప్రారంభించారు అనిత వంగ‌ల‌పూడి. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కృషి చేస్తున్నార‌ని చెప్పారు.

ఈ త‌రుణంలో ఇలాంటి జాతీయ స్థాయి పోలీస్ క్రీడా పోటీలు నిర్వ‌హించ‌డం ఆనందంగా ఉంద‌న్నారు. తాను హొం శాఖ మంత్రిగా ఉన్న స‌మ‌యంలో వీటిని ప్రారంభించే ఛాన్స్ ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు. నిరంతరం ప్రజా భద్రత కోసం 24 గంటలు శ్రమించే మన పోలీసు సోదరులకు మానసిక ఉల్లాసం, ఐక్యతను పెంపొందించడానికి ఇటువంటి క్రీడలు ఎంతో అవసరం అన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. సుమారు 6 రాష్ట్రాల నుండి వచ్చిన 10 జట్లకు శుభాకాంక్ష‌లు తెలిపారు. క్రీడల్లో గెలుపు ఓట‌ముల కంటే క్రీడా స్ఫూర్తితో పాల్గొనడమే ముఖ్యమ‌ని స్ప‌ష్టం చేశారు.