నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వరంగల్ జల్లా : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాష్ట్రం రాలేదన్నారు. సంబండ వర్గాలు కలిసికట్టుగా పోరాడితే వచ్చిందన్నారు. తాము కూడా ఉద్యమంలో పాల్గొన్నామని అన్నారు. ఆయన లేక పోతే తెలంగాణ రాదంటూ పదే పదే బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు , తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. గత 10 ఏళ్ల పాలనా కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు సాగించిన అరాచకాలు, అవినీతి, అక్రమాలు అన్నీ ఇన్నీ కావని అన్నారు.
2014కు ముందు కల్వకుంట్ల కుటుంబంలో ఎన్ని ఆస్తులు ఉండేవని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఎన్ని ఆస్తులు సంపాదించారో ప్రజలకు బహిరంగంగా చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. తనకు ప్రజల బలం ఉందని, అందుకే తనను గెలిపించారని ఆ విషయం తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. ఉన్న అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు కడియం శ్రీహరి. అందుకే ప్రజలు అధికారానికి దూరం చేశారని , తమకు పట్టం కట్టారని అన్నారు. ఇకనైనా బీఆర్ఎస్ శ్రేణులు బట్ట కాల్చి ఇతరుల మీద వేయడం మానుకోవాలని హితవు పలికారు.






