గరికపాటి కామెంట్స్ పై మాజీ ఐపీఎస్ ఫైర్
అమరావతి : మాజీ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ నిప్పులు చెరిగారు. ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు తాజాగా చేసిన కామెంట్స్ పట్ల సీరియస్ అయ్యారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎంత ప్రతిభ, పాండిత్యం ఉన్నా వృధా అని అన్నారు. పది మందికి సాయం చేయని చేతులు ఉన్నా లేనట్టేనని పేర్కొన్నారు. మానవత్వం లేని పాండిత్యం వృధా అని అన్నారు. గరికపాటి గతంలో దళితుల కు , మహిళలకు జరిగిన అన్యాయాల పట్ల అవగాహన తో మాట్లాడారని గుర్తు చేశారు.
ఇదే సమయంలో పెత్తందారీ, పితృస్వామ్య వ్యవస్థ ల తరపున క్షమాపణ కూడా చెప్పారు. అందుకే ఆయన అంటే గౌరవం ఉండేదన్నారు పీవీ సునీల్ కుమార్. కానీ పేద పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టడం మీద ఆయన మాట్లాడిన మాటలు వింటే అసహ్యం వేసిందన్నారు. ఎన్ని శాస్త్రాలు చదివినా తన తోటి మనిషి పట్ల , పేద పిల్లల పట్ల సానుభూతి, అవగాహనా లేకపోతే ఆ పాండిత్యం దేనికి అని ప్రశ్నించారు పీవీ సునీల్ కుమార్. ఇంట్లో పిల్లలకి భోజన పెట్టలేని పేద తల్లిదండ్రులు చదువు ఎలా చెప్పిస్తారు? ఆ పిల్లల్ని పనిలో పెట్టడం తప్ప. చదువు లేకుండా ఆ పిల్లలు చాకిరీ చేస్తూ జీవితాల్ని ముగిస్తారు . కనీసం ఒక పూట భోజనం దొరుకుతుంది అంటే ఆ పిల్లలని బడికి పంపుతారని ఆ విషయం తెలుసు కోకుండా మాట్లాడం దారుణమన్నారు. తప్పకుండా గరికపాటి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.





