బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కామెంట్స్
కరీంనగర్ జిల్లా : బిఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని అన్నారు. ఎమ్మెల్యే ఇవాళ మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నిష్కళంకమైన నేత అని ప్రశంసలు కురిపించారు. ఆయనను స్పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం నేటి యువతరానికి ఉందన్నారు. రాజకీయాలలోకి రావాలని అనుకున్న వాళ్లకు తను ఓ స్పూర్తి అని పేర్కొన్నారు, ఆయనను తమ పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నానని పేర్కొన్నారు. అధిష్టానం అనుమతిస్తే తానే స్వయంగా వెళ్లి ఆయనను పార్టీలోకి తీసుకొస్తానని ప్రకటించారు.
రోజు రోజుకు రాజకీయాలు కలుషితమై పోయిన తరుణంలో ఇలాంటి వాళ్లు ఉండడం చాలా అరుదు అని పేర్కొన్నారు, అవసరమైతే మాజీ మంత్రి జీవన్ రెడ్డిని భుజాన మోస్తానని వ్యాఖ్యానించారు. గన్మెన్లు, ఆర్భాటాలు లేకుండా సామాన్యంగా తిరిగే ఆయన వ్యక్తిత్వం అందరికీ ఆదర్శమని కొనియాడారు ఎమ్మెల్యే సంజయ్. తన జీవిత కాలంలో ఆయన అరుదైన నాయకుడని పేర్కొన్నారు. ఇలాంటి వాళ్లే నేటి సమాజానికి అత్యంత అవసరమని స్పష్టం చేశారు ఎమ్మెల్యే.





