కార్మికుల స‌మ్మె విర‌మ‌ణ బ‌స్సులు రైట్ రైట్

VijayaBhaskar · April 25, 2026
Spread the love

ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చిన రేవంత్ రెడ్డి స‌ర్కార్

హైద‌రాబాద్ : ఆర్టీసీ డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. ఈ ప్ర‌భుత్వానికి స‌మాధి క‌డ‌తామ‌ని ఆర్టీసీ కార్మికులు క‌న్నెర్ర చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రుల‌ను ఏకి పారేశారు. మీరు బ‌య‌ట ఎలా తిరుగుతారో చూస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఓ వైపు తీవ్ర ఉద్రిక్త‌త న‌డుమ గ‌త్యంత‌రం లేక స‌ర్కార్ దిగి వ‌చ్చింది. డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ఆధ్వ‌ర్యంలో మెల్ల‌గా స‌మావేశం ఏర్పాటు చేశారు. ఆర్టీసీ జేఏసీ నేత‌ల‌తో స‌మావేశం అయ్యారు. ప్ర‌ధాన డిమాండ్ల‌పై వాదోప‌వాద‌న‌లు జ‌రిగాయి. చివ‌ర‌కు అన్ని డిమాండ్ల‌కు ఒప్పుకుంటేనే స‌మ్మె విరమిస్తామ‌ని ప్ర‌క‌టించారు నేత‌లు.

దీంతో స‌ర్కార్ ఓకే చెప్ప‌క త‌ప్ప‌లేదు. జేఏసీ నేత‌లు స‌మ్మెను విర‌మిస్తున్నట్లు ప్ర‌క‌టించారు. అర్ధ‌రాత్రి నుంచే మొదటి డ్యూటీ బస్సులు రోడ్డెక్కాయి. మూడు రోజులుగా వేలాది మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తమ డిపోల పరిధిలో కార్మిక జేఏసీ నిర్వహించే అన్ని నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వివిధ రూపాల్లో తమ ఆందోళన, ఆవేదనను తెలియజేస్తూ.. ప్రభుత్వ కండ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. సమ్మె చర్చలు ఓ కొలిక్కి రావడంతో అంతా యథావిధిగా విధులకు హాజ‌ర‌య్యారు. ఈ పోరాటంలో కార్మికుడు శంకర్‌గౌడ్‌ ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా ఉన్నదని కార్మికులు కంటత‌డి పెట్టారు.