రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి సొసైటీపై ప్రశంస
నల్లగొండ జిల్లా : రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేద విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండలో జరిగిన రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రెడ్డిలందరూ ధనికులు అనే భావన సరికాదన్నారు. ఈ కులంలో కూడా కటిక పేదరికంలో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా గ్రామాల్లోని పేద రెడ్డి విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించేలా, సాంకేతిక కోర్సుల్లో రాణించేలా ఎడ్యుకేషనల్ సొసైటీ తగిన ఆర్థిక సహకారం, తోడ్పాటు అందించాలని కోరారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సొసైటీలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేసి సమాజ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పేదలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని, నల్లగొండ పట్టణాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు మంత్రి. అనంతరం నల్గొండలోని శ్రీనివాస కాలనీలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లును ప్రారంభించారు. వారిని అభినందించారు.





