చెత్త ఫీల్డింగ్ వ‌ల్ల‌నే ల‌క్నోతో ఓట‌మి పాల‌య్యాం

VijayaBhaskar · May 8, 2026
Spread the love

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ర‌జత్ పాటిదార్

ల‌క్నో : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో అనూహ్యంగా డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు ఓట‌మి పాలైంది. చివ‌రి దాకా వ‌చ్చి చేతులెత్తేసింది. ప్ర‌ధానంగా ల‌క్నో బౌల‌ర్లు ప్రిన్స్ యాద‌వ్ , మ‌హ‌మ్మ‌ద్ ష‌మీ అద్భుతంగా బౌలింగ్ చేశారు. మ‌రో వైపు ల‌క్నో కు చెందిన మిచెల్ మార్ష్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌ను కేవ‌లం 56 బంతులు ఆడి 9 ఫోర్లు 9 సిక్స‌ర్ల‌తో క‌దం తొక్కాడు. 111 ర‌న్స్ చేశాడు. శ‌త‌కంతో అల‌రించాడు. దీంతో ల‌క్నో 19.2 ఓవ‌ర్ల‌లో 213 ర‌న్స్ చేసింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన ఆర్సీబీ 209 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఈ సంద‌ర్బంగా ఆర్సీబీ కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ మీడియాతో మాట్లాడాడు.

మా ఫీల్డింగ్ లోపం వల్లే మేము ఈ మ్యాచ్ ఓడిపోయామని నేను భావిస్తున్నాను. మేము ఇన్ని క్యాచ్‌లు జారవిడుస్తూ, సులభమైన ఫీల్డింగ్ అవకాశాల్లో పరుగులు ఇస్తూ ఉంటే, మ్యాచ్‌లు గెలవడం చాలా కష్టమవుతుంది. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు, మేము మా ఫీల్డింగ్‌పై కూడా దృష్టి పెట్టాలి. మా ఫీల్డింగ్ సరిగ్గా లేకపోతే, మేము ఎప్పటికీ మ్యాచ్‌లు గెలవలేం అన్నాడు పాటిదార్. ఆరంభంలో పవర్‌ప్లేలో మేము చాలా త్వరగా వికెట్లు కోల్పోయామని, అందుకే ఈ మ్యాచ్ ఓడిపోయామని నేను భావిస్తున్నాను. రాబోయే మ్యాచ్‌లలో మా తప్పులను సరిదిద్దుకుని, విజయాలతో మరింత బలంగా తిరిగి వస్తామని ఆశిస్తున్నాను అని అన్నాడు.