పిసిసి అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం త్యాగం చేసిన విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు తప్పకుండా న్యాయం చేస్తామని త్వరలోనే విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ కు పాలక మండలి ఏర్పాటు చేసి ఆదుకుంటామని పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం ఆధ్వర్యంలో 33 జిల్లాల సంఘాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, రాష్ట్ర జిల్లా సంఘాల నాయకులు హైదరాబాద్ గాంధీభవన్ లో పీసీసీ చీఫ్ ను కలిశారు. ఈ సందర్బంగా నివేదిక సమర్పించారు. రాష్ట్రంలో 16 లక్షల మంది జనాభా ఉందని న్యాయం చేయాలని కోరారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సామాజిక వర్గానికి తప్పకుండా ఆదుకుంటామన్నారు మహేష్ కుమార్ గౌడ్.
ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం అధ్యక్షులు డాక్టర్ వేములవాడ మదన్మోహన్ , గౌరవాధ్యక్షులు డాక్టర్ లాలుకోట వెంకటాచారి , రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ చొల్లేటి కృష్ణమాచార్యులు తదితరులు మాట్లాడారు. గత 40 సంవత్సరాల నుండి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయుల సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దాదాపు 42 మంది ఆత్మాహుతికి పాల్పడ్డారని, గత పది సంవత్సరాల నుండి కార్పోరేట్ కల్చర్ ప్రవేశంతో వృత్తులు కొల్పోయి ఉపాధి లేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు ,ఆకలి చావులకు గురైనారని వాపోయారు.
గత 60 సంవత్సరాల నుండి విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతి సంక్షేమం కోసం కృషి చేస్తున్న మాతృ సంస్థ ఇదేనని చిన్న చిల్లర సంఘాలను దూరం పెట్టాలని కోరారు. అన్ని సామాజిక వర్గాలతో పాటు విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సామాజిక వర్గానికి కూడా వెంటనే పాలకమండలి ఏర్పాటు చేసి నిధులు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సంఘం రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షురాలు చిలుకూరి లక్ష్మీ రామాచారి తదితరులు పాల్గొన్నారు.





