స్పష్టం చేసిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ
అమరావతి : ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం పనుల ప్రగతిపై అత్యవసర సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. రాజధాని నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తప్పవన్నారు. అధికారులు, ఇంజనీర్లు కాంట్రాక్ట్ సంస్థలతో పనుల పురోగతిపై చర్చించారు. ఏఏ నిర్మాణాల పురోగతి ఎంత మేరకు వచ్చిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు మంత్రి నారాయణ. రాజధాని గ్రామాల్లో రోడ్లు, డ్రైన్లు ఇతర మౌలిక సదుపాయాలను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహిస్తే బాగుండదన్నారు పొంగూరు నారాయణ.
LPS లేఔట్లు, రోడ్లు నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని అన్నారు. కాగా ప్రాజెక్టుల వారీగా పనుల పురోగతిని మంత్రి నారాయణకు వివరించే ప్రయత్నం చేశారు ఉన్నతాధికారులు. సమీక్ష అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏపీ కూటమి సర్కార్ అమరావతి రాజధాని నిర్మాణం పనులను ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. ఇందు కోసం పెద్ద ఎత్తున నిధులను ఎప్పటికప్పుడు మంజూరు చేయడం జరుగుతోందన్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబు నాయుడు మార్గ నిర్దేశంలో అమరావతిని రాబోయే రోజుల్లో విశ్వ నగరంగా తీర్చి దిద్దుతామన్నారు నారాయణ.





