Friday, 16 October 2026

హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై సీఎస్ స‌మీక్ష

newsseals-TelanganaCS

ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేయాల‌ని ఆదేశం

హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా ప్రతిపాదిత హైస్పీడ్ రైలు కారిడార్ ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు శుక్రవారం డా.బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ భాగస్వామ్యంతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సి.ఎస్ అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు రిపోర్టులు, ప్రాజెక్టు అమలులో అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో కలసి పనిచేయాలని, ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధి, ఇతర అంశాలపై తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్ నుండి ముంబై, చెన్నై, బెంగళూరు ప్రధాన నగరాలకు అనుసంధానించే హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు వలన తెలంగాణ రైజింగ్ 2047 ఎకనామిక్ గ్రోత్ కారిడార్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని సి.ఎస్ పేర్కొన్నారు. దేశంలో వేగవంతమైన రవాణా వ్యవస్థకు హై స్పీడ్ రైలు ప్రాజెక్టు నిలుస్తుందని, ప్రజల భవిష్యత్ అవసరాలకు, పారిశ్రామిక, ఐటి, పర్యాటక రంగాలలో అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఉపకరిస్తుందని సి.ఎస్ తెలిపారు.

హైదరాబాద్ – పూనే – ముంబై హై స్పీడ్ రైల్ మార్గానికి సంబంధించి డి.పి.ఆర్ సిద్ధం అయ్యిందని రైల్వే అధికారులు తెలిపారు. సూమారు 671 కి. మీటర్ల మార్గానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామని, తెలంగాణ రాష్ట్రంలో 93 కి. మీటర్ల మేరకు భూ సేకరణ అవసరం ఉంటుందని, అదేవిధంగా హైదరాబాద్ – బెంగళూరు కారిడార్, హైదరాబాద్ – చెన్నై కారిడార్ లో సూమారు 123 కి.మీటర్ల నిడివిలో భూసేకరణ అవసరమని, కోకాపేట, శంషాబాద్ ప్రాంతాలలో రైల్వే డిపోలకు కొంత భూసేకరణ చేయాలని పేర్కొన్నారు. వీటికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ, హెచ్.యం.డి.ఎ, జీఎంఆర్ ఎయిర్ పోర్టు అధికారులు కేంద్ర రైల్వే ప్రాజెక్టు అధికారులతో సమన్వయం చేసుకొని హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ కు సహకరించాలని సి.ఎస్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *