Friday, 16 October 2026

మేం అధికారంలో ఉంటే టిమ్స్ ఎప్పుడో పూర్త‌య్యేది

newsseals-KTR

కాంగ్రెస్ స‌ర్కార్ పై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్ర‌హం

హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్‌, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తో క‌లిసి టిమ్స్ ఆస్ప‌త్రిని సంద‌ర్శించారు. త‌మ ప్ర‌భుత్వం గ‌నుక ఉండి ఉంటే ఎప్పుడో టిమ్స్ పూర్త‌య్యేద‌న్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించేలా టిమ్స్‌ను ఆలోచించి రూపకల్పన చేశాం అని అన్నారు. సనత్‌నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించామని తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీ, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌తో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్‌ను తీసుకువచ్చిందని చెప్పారు.

హైదరాబాద్‌లో సనత్‌నగర్, ఎల్‌బీనగర్, ఆల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశామని వెల్ల‌డించారు కేటీఆర్. వరంగల్‌లో 2000 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రిని, నిమ్స్ ఆసుపత్రిని కూడా భారీ స్థాయిలో విస్తరించామని చెప్పారు. సనత్‌నగర్ టిమ్స్‌లో మొత్తం మూడు బ్లాకులు నిర్మించామని తెలిపారు. 300 ICU బెడ్స్‌తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.
రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశామన్నారు. రూ. 1200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టామని వెల్లడించారు. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది అని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *