ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్
అమరావతి : యోగా అన్నది మన జీవితంలో విడదీయలేని భాగం కావాలని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్. శనివారం ఉండవల్లిలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామ్ దేవ్ బాబా మాట్లాడారు. ప్రధాని మోదీ యోగాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారని అన్నారు. 190 దేశాలు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయని తెలిపారు. భారత దేశ కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింప చేసేవి మన సంస్కృతి, విలువలేనని అన్నారు. అలాంటి మన దేశ సంస్కృతిని ప్రపంచ దేశాల ముందు ఉంచిన ఘనత మోదీకే దక్కిందని కితాబు ఇచ్చారు బాబా.
మన విలువలను కాపాడుకోవాలి.. భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.. ఆధ్యాత్మికతో కూడిన వికసిత్ భారత్ సాధించాలని ప్రధాని ప్రయత్నిస్తున్నారు.. ఆయనకు సహకరిద్దాం. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్నాం.. 20 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారు. రసాయన రహిత పంటలను ప్రజలకు అందించే లక్ష్యంతో పని చేస్తున్నాం. ప్రజా రోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. సంజీవనిలో భాగంగా యోగాసాధన, ప్రాణామయం వంటివి కూడా చేరుస్తున్నాం అన్నారు సీఎం.
సంజీవని కార్యక్రమంలో రోగ చికిత్స కంటే.. రోగ నివారణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. దేవతల రాజధాని అమరావతి స్పూర్తితో ప్రజా రాజధానిని నిర్మిస్తున్నాం. రాజధానికి భూములిచ్చిన రైతులకు ధన్యవాదాలు. నెట్ జీరో విధానంలో కాలుష్య రహిత రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. రాజధాని ప్రాంతంలో అభివృద్ధితో పాటు ఆధ్యాత్మికతకు, పర్యాటకానికి పెద్ద పీట వేస్తున్నాం. నివాస యోగ్య ప్రాంతంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం. అమరావతి భవిష్యత్ నగరం అని సీఎం చెప్పారు.





