ఆక్వా రంగం అభివృద్దిపై స‌ర్కార్ ఫోక‌స్

VijayaBhaskar · June 20, 2026
Spread the love

పారిశ్రామికవేత్త‌ల‌కు ప్ర‌త్యేక ప్రోత్సాహ‌కాలు

అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా బీమ‌వ‌రంలో ప‌ర్య‌టించారు. ఈసంద‌ర్భంగా నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా చేసేందుకు గాను భారీ ఖ‌ర్చు చేసి నూత‌నంగా విద్యుత్ స‌బ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆక్వా సాగు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ఆక్వా రంగ అభివృద్ధికి, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు ముందుకు వ‌చ్చే పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తున్నామని మంత్రి వివ‌రించారు.

ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందిస్తూ., నష్టాల నుంచి రక్షిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ అభివృద్ధికి కూట‌మి ప్రభుత్వం అధిక‌ ప్రాధాన్యత ఇస్తోందని స్ప‌ష్టం చేశారు. అవసరమైన చోట కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్నామ‌ని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు.

భవిష్యత్తులో కూడా ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్ప‌ష్టం చేశారు. కార్య‌క్ర‌మంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామ కృష్ణంరాజు, రాజ్యసభ సభ్యులు పాక వెంకట సత్యనారాయణతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూట‌మి నేత‌లు పాల్గొన్నారు.