మోదీ నాయ‌క‌త్వంలో క్రీడా శక్తిగా భారత్

VijayaBhaskar · June 23, 2026
Spread the love

ప్ర‌శంసించిన‌ ఎంపీ రఘునందన్‌ రావు

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ బలమైన క్రీడా శక్తిగా ఎదుగుతోందని తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం అధ్యక్షుడు, మెదక్‌ పార్లమెంట్‌ సభ్యుడు మాధవనేని రఘునందన్‌ రావు అన్నారు. న్యూఢిల్లీలోని భారత్‌ మండపంలో జరుగుతున్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ నాలుగో రోజు పోటీల ముగింపు కార్యక్రమానికి జాతీయ ఫెన్సింగ్‌ సంఘం ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ మెహతా ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖేలో ఇండియా, ఫిట్‌ ఇండియా, ఖేలో సన్స్‌ద్‌ ఉత్సవ్‌ వంటి కార్యక్రమాల ద్వారా గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో క్రీడా విప్లవానికి నాంది పలికారని కొనియాడారు.

ఈ కార్యక్రమాలు దేశంలో క్రీడా సంస్కృతిని బలోపేతం చేయడంతో పాటు యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించాయని అన్నారు 30 దేశాల నుంచి 400 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్న ఆసియా సీనియర్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని పేర్కొన్నారు. ఒలింపియన్లు సహా ఆసియా ఖండంలోని ప్రముఖ ఫెన్సర్లతో భారత క్రీడాకారులు పోటీపడటం దేశంలో ఫెన్సింగ్‌ క్రీడాభివృద్ధికి ఎంతో ఉపయోగ పడుతుందని చెప్పారు.