Friday, 16 October 2026

రూ.6.3 కోట్లతో న‌ర‌సింహ స్వామి ఆల‌య జీర్ణోద్ద‌ర ప‌నులు

newsseals-MangalagiriNarasmhaSwamy

మంగళగిరి: ప్రముఖ పుణ్యక్షేత్రం మంగళగిరి దిగువ సన్నిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం జీర్ణోద్ధరణ పనులకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో నూతన యాగశాల నిర్మాణంతో పాటు వాహనశాల, గంటా మండపం పునర్నిర్మాణం, శ్రీకృష్ణ దేవరాయ మండపం పునరుద్ధరణ పనులకు మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆలయ అధికారులు ఏర్పాటుచేసిన నమూనా చిత్రాలను పరిశీలించారు. అనంతరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని, రాజ్యలక్ష్మీ అమ్మ వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు వేదాశీర్వచనం చేశారు. స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

దేవాదాయ శాఖ నిధులు రూ.6.3 కోట్ల వ్యయంతో శ్రీకృష్ణ దేవరాయ మండపం పునరుద్ధరణతో పాటు యాగశాల, గంటా మండపం, వాహనశాల పునర్నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా దేవాలయం మొత్తం కలియ తిరిగిన మంత్రి నారా లోకేష్ అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు కావాల్సిన వసతులు, ఆలయ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఆలయ సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కల్పించడంతో పాటు నిత్య ప్రసాదానికి చర్యలు తీసుకోవాలన్నారు. పుష్కరిణిని పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అందరితో కలిసి ఫోటోలు దిగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *