నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్
తిరుపతి జిల్లా : తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా పొందుతూ, గదులు దొరకని భక్తులకు అధిక ధరలకు విక్రయించి అక్రమ లాభాలు పొందుతున్న నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను టీటీడీ విజిలెన్స్ సమాచారంతో తిరుమల II టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. జూలై 2వ తేదీన సి.ఆర్.ఓ. కార్యాలయం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను టీటీడీ సిబ్బంది గుర్తించి పోలీసులకు అప్పగించారు. దర్యాప్తులో మొబైల్ యాప్‌ల ద్వారా నకిలీ ఆధార్ కార్డులను తయారు చేసి టీటీడీ గదులను పొందడం, అనంతరం వాటిని రూ.2,000 నుంచి రూ.3,000 వరకు అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తూ వచ్చినట్లు వెల్లడైంది. వారి సమాచారంతో మరో నిందితుడిని కూడా అరెస్టు చేశారు.
ఇదిలా ఉండగా అరెస్ట్ అయిన వారిలో ఇద్దరు నిందితులు తెలంగాణకు చెందిన వారు కాగా ఏపీకి చెందిన ఒకరు, ఉత్తర ప్రదేశ్ కు చెందిన మరొకరు ఉన్నారు. వీరిలో ఎం. వేణుగోపాల్, దొంత రవీంద్ర బాబు, సంతోష్ కుమార్ , టి. ఈశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరి వద్ద నుంచి 2 ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్లు, 12 నకిలీ ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా గత కొంతకాలంగా నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదులను అక్రమంగా పొందుతూ శ్రీవారి భక్తులను, టీటీడీని మోసం చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. నిందితులను న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఈ అక్రమ దందాను ఛేదించిన తిరుమల II టౌన్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ అధికారులను తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి మురళీకృష్ణ అభినందించారు.