గాన కోకిల ఎస్. జానకి మృతి బాధాకరం : జగన్
అమరావతి : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయారని జగన్ పేర్కొన్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు.
తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్. జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్తించినట్లు తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతిని పేర్కొన్నారు.